గృహిణులకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4,000... భారీ హామీలతో 'టీవీకే' మానిఫెస్టో ఆవిష్కరించిన విజయ్

  • 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే మేనిఫెస్టో విడుదల
  • గృహిణులకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతిగా రూ.4,000 హామీ
  • ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • పాలన, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
  • తమిళనాడును డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
నటుడి నుంచి రాజకీయ నేతగా మారిన విజయ్, తన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, భారీ సంక్షేమ పథకాలు, టెక్నాలజీ ఆధారిత పాలన హామీలతో కూడిన పార్టీ మేనిఫెస్టోను గురువారం సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా పునర్నిర్మించేందుకు రంగాలవారీగా సంస్కరణలు చేపడతామని ప్రకటించారు. సంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతను పాలనలో ప్రవేశపెట్టడం ద్వారా వినూత్న మార్పునకు శ్రీకారం చుడతామని విజయ్ స్పష్టం చేశారు.

ప్రజాకర్షక పథకాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. గృహిణులకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు ₹2,500 భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఐదు లక్షల మందికి రూ.18,000 చొప్పున ఉపాధి ఆధారిత మద్దతు పథకాన్ని ప్రకటించారు. దీంతో పాటు, ఇంటర్న్‌షిప్ చేసే యువతకు రూ.5,000 నుంచి రూ.8,000 వరకు స్టైఫండ్ ఇస్తామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందించే పింఛనును నెలకు రూ.3,000కు పెంచుతామని, దాదాపు 15 లక్షల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు.

మహిళా సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, పేద యువతుల వివాహానికి ఒక సవర బంగారం, పట్టు చీరతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తామని వాగ్దానం చేశారు. ప్రభుత్వ భూముల్లో అర్హులైన వారికి ఉచితంగా ఇంటి పట్టాలు ఇస్తామన్నారు.

ఆరోగ్య రంగంలో ఉచిత వైద్య పరీక్షలు, తక్కువ ధరలకే మందులు, క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక బీమా సౌకర్యం కల్పిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. ప్రాథమిక సేవలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు.

రైతులకు అండగా నిలుస్తూ, ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల రుణాల్లో 50 శాతం మాఫీ చేస్తామని, సౌరశక్తి ప్రాజెక్టులను ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. మత్స్యకారులకు కనీస మద్దతు ధర, చేపల వేట లేని సమయంలో రూ.27,000 ఆర్థిక సహాయం, రూ.25 లక్షల బీమా కవరేజీ కల్పిస్తామన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి అంగన్‌వాడీ సిబ్బందికి రూ.18,000, పారిశుద్ధ్య కార్మికులకు రూ.10,000 వేతనం, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రూ.15 లక్షల ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ, "డ్రగ్-ఫ్రీ తమిళనాడు" కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని విజయ్ ప్రకటించారు. ఆర్థికంగా, 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.15,000 కోట్లతో భద్రతా నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేనిఫెస్టో ద్వారా సంక్షేమ పథకాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిని జోడించి ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు టీవీకే సిద్ధమవుతోంది.

Vijay
Tamilaga Vettri Kazhagam
TVK Manifesto
Tamil Nadu Elections 2026
Tamil Nadu Politics
Welfare Schemes
Free Electricity
Financial Assistance
Unemployment Allowance
Tamil Nadu

More Telugu News